సికింద్రాబాద్‌ ఉజ్జయని మహంకాళి ఆలయ చరిత్ర

 సికింద్రాబాద్‌ ఉజ్జయని మహంకాళి ఆలయ చరిత్ర

సికింద్రాబాద్‌ ఉజ్జయని మహంకాళి ఆలయ చరిత్ర


హైదరాబాద్‌, సికిందరాబాద్‌ నగరాలలో జాతర అంటేనే లష్కర్‌ బోనాలుగా పరిగణిస్తారు. లష్కర్ బోనాలుగా పేరొందిన సికింద్రాబాద్ ఉజ్జయని మహంకాళి జాతరకు ఎంతో చారిత్రక ప్రాముఖ్యత ఉంది. గ్రామదేవతలైన అమ్మవారికి ఆషాడ మాసంలో జాతరలు చేసి, బోనాలు సమర్పించుకుంటారు. అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తే ఎలాంటి బాధలు ఉండవని, రాజ్యం సుభిక్షంగా ఉంటుదని నమ్మకం.

తమ కుటుంబాలను చల్లగా చూడాలని మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు చేసి, బోనం సమర్పించడం ఆనవాయితీ. ఆషాడంలోనే కాకుండా కొన్ని ప్రాంతాల్లో శ్రావణంలో కూడా జరుపుకుంటారు. గోల్కొండ బోనాలతో ఈ బోనాల జాతరలు ప్రారంభమవుతాయి. సికింద్రాబాద్‌ బోనాలను ఉజ్జయని మహాంకాళి బోనాలు అని ఎందుకు అంటారు.. ఆ పేరు ఎలా వచ్చింది.. తెలియాలంటే ఉజ్జయని మహాంకాళి దేవాలయ చరిత్ర తెలుసుకోవాల్సిందే..

ఉజ్జయని మహంకాళి ఆలయ చరిత్ర

ఉజ్జయని మహాంకాళి దేవాలయం 1815లో నిర్మితమైనది. సికింద్రాబాద్ పాత బోయిగూడ నివాసి అయిన సురటి అప్పయ్య బ్రిటిష్ ఆర్మీలో ఉద్యోగం చేసేవారు. తన స్వస్థలంలో విధులు నిర్వహిస్తున్న ఆయనను 1813 సంవత్సరంలో ఉద్యోగ రీత్యా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినికి బదిలీ చేశారు. బదిలీ జరిగిన కొద్దిరోజులకే ఉజ్జయిని ప్రాంతంలో కలరా వ్యాధి సోకి వేలాది మంది చనిపోయారు. అదే సమయంలో మిలటరీ ఉద్యోగం చేస్తున్న అప్పయ్య సహోద్యోగులతో కలిసి ఉజ్జయినిలోని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ఉజ్జయినిలో కలరా వ్యాధి నుండి ప్రజలను కాపాడలని, పరిస్థితులు చక్కబడితే తన స్వస్థలమైన సికింద్రాబాద్ (లష్కర్)లో ఉజ్జయిని అమ్మవారికి గుడి కట్టి కొలుస్తామనీ వేడుకున్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు కలరా వ్యాధికి గురైన వారు కోలుకున్నారు. కలరా వ్యాధి తగ్గుముఖం పట్టింది.

 

అమ్మవారు కరుణించడం వల్లనే కలరా వ్యాధి తగ్గిందని సురటి అప్పయ్య, ఆయన మిత్రులు విశ్వసించారు. ఆయన 1815లో ఉజ్జయిని నుండి సికింద్రాబాద్‌కు వచ్చారు. ఉజ్జయినిలో జరిగిన కలరా వ్యాధి సమయంలో తన మొక్కుబడి గురించి కుటుంబసభ్యులకు ఆయన వివరించారు. కుటుంబ సభ్యులు, ఇరుగు పొరుగు వారితో కలిసి పాతబోయిగూడ బస్తీకి దూరంగా ఉన్న ఖాళీ స్థలంలో (ప్రస్తుతం గుడి ఉన్న ప్రాంతంలో) కట్టెలతో తయారు చేసిన మహంకాళి అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ఉజ్జయిని మహంకాళిగా నామకరణ చేసి పూజలు ప్రారంభించారు.

ఉజ్జయినిలో తాను అమ్మవారిని దర్శించుకున్నది ఆషాఢమాసం కావటంతో సికింద్రాబాద్‌లోనూ ఆషాఢంలో జాతర జరపాలని ఆయన నిర్ణయించారు. జాతరకు తరలివచ్చే భక్తులకు నీటి సౌకర్యం కోసం పక్కనే ఉన్న పాడుబడ్డబావిని పురుద్ధరిస్తున్న సమయంలో మాణిక్యాల అమ్మవారి ప్రతిమ లభించింది. ఆ ప్రతిమను మహంకాళి అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించి మాణిక్యాల అమ్మవారిగా నామకరణం చేశారు. 1815 నుండి ఆషాఢ మాసంలో ప్రతి సంవత్సరం బోనాల జాతర నిర్వహించి, వ్యాధుల బాధల నుండి ప్రజలను రక్షించాలని ఆయన నిర్ణయించారు. అప్పటి నుండి గత రెండు దశాబ్దాలుగా ప్రతి ఆషాఢంలో సికింద్రాబాద్ వాసులు బోనాల జాతర జరుపుకుంటున్నారు.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad